Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, April 25, 2013

యోహాను వ్రాసిన రెండవ పత్రిక

1. పెద్దనైన నేను, ఏర్పరచబడినదైన అమ్మగారికిని. ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయునది. 
2. నేనును,నేను మాత్రమే  గాక సత్యము ఎరిగినవారందరును, మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడు ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము. 
3. సత్యప్రేమలు మనయందుండగా తండ్రియైన దేవుని యొద్దనుండియు, తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తునొద్దనుండియు కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. 
4.తండ్రి  వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట  కనుగొని బహుగా సంతోషించుచున్నాను. 
5. కాగా అమ్మా, క్రొత్త ఆజ్ఞ  నీకు వ్రాసినట్టు కాదు గాని మొదట నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయుచు, మనము ఒకరినొకరము ప్రేమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను. 
6. మనమాయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే  ప్రేమ; మీరు మొదట నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెను అనునదియే ఆ ఆజ్ఞ . 
7. యేసు క్రీస్తు శరీరధారియై వచ్చెనని యొప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి యున్నారు. 
8. అట్టివాడే వంచకుడును క్రీస్తువిరోధియునైయున్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. 
9. క్రీస్తుబోధ యందు నిలిచియుండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు; ఆ బోధ యందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. 
10. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన యెడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు;శుభమని వానితో చెప్పనువద్దు. 
11. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలివాడగును. 
12. అనేక సంగతులు మీకు వ్రాయవలసి యుండియు సిరాతోను కాగితముతోను వ్రాయ మనస్సు లేక మీ సంతోషము పరిపూర్ణమవునట్లు మిమ్మును కలిసికొని ముఖాముఖిగా మాటలాడ నిరీక్షించుచున్నాను. 
13. ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు.